అమెరికా లక్ష్యంగా క్షిపణుల పరీక్ష

0
24

జపాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా తమ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు క్షిపణులను పరీక్షించామని ఉత్తర కొరియా జాతీయ మీడియా మంగళవారం తెలిపింది. క్షిపణులను పరీక్షించడానికి కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర్వులు ఇచ్చారని జాతీయ మీడియా ఏజెన్సీ(కేసీఎన్‌ఏ) తెలిపింది. బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని చూసి ఆయన కళ్లు ఎంతో సంతోషించాయని, హ్వసొంగ్ శత్రఘ్ని దళాన్ని ఉన్ ప్రశంసలతో ముంచెత్తారని తెలిపింది. ఏక కాలంలో ప్రయోగించిన నాలుగు బాలిస్టిక్ క్షిపణులు ఎగిరే సైనికులు చేసే విన్యాసాలాగా ఉన్నాయని ఉన్ పేర్కొన్నారని తెలిపింది. జపాన్‌లోని అమెరికా సామ్రాజ్యవాద బలగాల సైనిక స్థావరాలే లక్ష్యంగా అప్పగించిన బాధ్యతలో పలు సైనిక విభాగాలు పాల్గొన్నాయని కేసీఎన్‌ఏ పేర్కొన్నది.

అమెరికాను రెచ్చగొట్టే విధంగా జపాన్ ప్రత్యేక ఆర్థికమండలిగా ఉన్న జలాల్లో నాలుగు క్షిపణుల్లో మూడు వచ్చి పడ్డాయి. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సవాల్‌గా పరిణమించింది. దీంతో ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగంపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి అమెరికా, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ స మావేశం బుధవారం జరిగే అవకాశం ఉన్నది. ఉత్తరకొరియా ఎలాంటి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని వినియోగించకుండా ఐరాస తీర్మానాలు ఉన్నాయి. ఉత్తరకొరియా విధ్వంసక చర్యలను ప్రపంచం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదని ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY