అమెరికా ఫస్ట్.. ఇండియా బెస్ట్ !

0
61

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల వలసలపై మాటజోరు తగ్గించారు. మెరిట్ ఆధారిత వలసలను అనుమతించవచ్చన్నారు. ముఖ్యంగా ఇండి యా వంటి దేశాల నుంచి హైటెక్ నిపుణుల రాకకు వీలుకల్పించే వలస విధానం రూపొందించాలన్నా రు. బుధవారం తొలిసారి అమెరికా కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల హామీలు ఏవిధంగా నెరవేర్చేదీ ఏకరువు పెట్టారు. కాన్సస్ కాల్పుల ఘటన జాత్యహంకార ఘటనే అని అంగీకరించారు. భారతీయ ఇంజినీర్‌ను కాల్చిచంపడాన్ని ఖండించారు. విద్వేషాన్ని, దుర్మార్గాలను ఖండించడంలో అమెరికా సమైక్యంగా ఉంటుందని యూదులపై దాడులు, కాన్సస్ కాల్పుల సందర్భంగా మరోసారి రుజువైందని అన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారుల బాధితుల కోసం అంతరంగిక భద్రతా మంత్రిత్వశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్రమ వలసదారుల చేతిలో తమ సన్నిహితుల ప్రాణాలను కోల్పోయిన కాంగ్రెస్ సభ్యుల పేర్లను ఆయన ప్రస్తావించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమెరికాను కాపాడి తీరుతానని శపథం చేశారు. తాను అమెరికాకు మాత్రమే ప్రతినిధినని, ప్రపంచానికి కాదని అన్నారు. అమెరికా స్ఫూర్తిని పునరుద్ధరిస్తానన్నారు. తన సహజ శైలిలో విపక్ష డెమొక్రాట్లపై, మీడియాపై విమర్శలు చేయకుండా సంయమనం పాటించారు. మేకింగ్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే తన ఎన్నికల ప్రచార నినాదాన్ని గుర్తు చేస్తూ అమెరికన్లకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చేస్తానని అన్నారు. భారత్ నుంచి వచ్చే నిపుణుల ప్రవేశానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నాసిరకం నిపుణుల రాక అమెరికాకు మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన లింకన్ మాటలను ఉదహరించారు.

లింకన్ చెప్పిన మెరిట్ మంత్రం

మెరిట్ ఆధారిత వలస విధానం అనుసరించాలని మొదటి రిపబ్లికన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పారని, ఆయన మాటలను అమెరికా అనుసరించాల్సిన తరుణం ఆసన్నమైందని ట్రంప్ అన్నారు. తక్కువ నైపుణ్యం కలవారిని అనుమతించే ప్రస్తుత వలసల విధానం నుండి దూరంగా వైదొలిగి.. మెరిట్ పద్ధతి ప్రవేశపెడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బోలెడు డాలర్లు ఆదా చేయొచ్చు. కార్మికుల జీతా లూ పెరుగుతాయి. వలస కుటుంబాలతోపాటు అమెరికాలోని పేద కుటుంబాలు మధ్యతరగతిలోకి మారేందుకు వీలుంటుంది అని ట్రంప్ అన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు, వేతనాలు మెరుగుపర్చి.. భద్రతకు, చ ట్టాలపట్ల గౌరవానికి పెద్దపీట వేసే వలసల వ్యవస్థ తేవాలని తాను నమ్మతున్నట్టు చెప్పారు.

అమెరికా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

అమెరికా ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 9.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని, 4.3 కోట్లమంది పేదలు సర్కారు అందించే ఆహారభద్రత కూపన్ల మీద ఆదారపడి బతుకుతున్నారని చెప్పారు. ఒబామా హయాంలో మొత్తం అందరు అధ్యక్షుల అప్పులతో సమానమైన మొత్తంలో అప్పు చేశారన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరాక అమెరికాలో 60 వేల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్పారు. అమెరికాలో కంపెనీలకు సులభ వాణిజ్య విధానం ప్రవేశపెట్టాలని, ఏ ఒక్కటీ తరలిపోకుండా కట్టుదిట్టం చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here