అభిశంసన పిటిషన్ వెనక్కి

0
10

న్యూఢిల్లీ: సర్వత్రా ఉత్కంఠ రేపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న విజ్ఞప్తితో, సుప్రీం కోర్టు లో దాఖలైన పిటిషన్‌కు మంగళవారం తెరపడింది. ఇద్దరు కాంగ్రెస్ ఎంపిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు హడావుడిగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలో తీవ్రంగా వ్యతిరేకించారు. పిటిషన్‌దారుల తరఫున వాదించిన ఆయన ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు అనుమతించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఈ ఆదేశాలు ఇచ్చివుంటే, అవి చెల్లవని స్పష్టం చేశారు. ధర్మాసన ఏర్పాటుపై జారీ అయిన ఉత్తర్వుల కాపీని తనకు ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు ఎకె సక్రీ అధ్యక్షుడుగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం నిరాకరించింది. వివరాలను వెల్లడిం చలేమని తేల్చిచెప్పింది. కేసును విచారించడమే తమ బాధ్యతగా పేర్కొంది. ఈ సమాధానంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సిబల్ ఇక వాదించడానికి ఏమీలేదని అన్నారు. ఆ వెంటనే, పిటిషన్‌దారులు, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రతాప్ సింగ్ భాజ్వా (పంజాబ్), అమీ హర్షద్‌రే యాజ్నిక్ తమ కేసును ఉపసంహరించుకున్నారు. మరుక్షణమే ఈ కేసును కొట్టివేస్తున్నట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. మొత్తంమీద సిజెఐపై అభిశంసన తీర్మానానికి సంబంధించిన వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. కానీ, తమ పదుపరి కార్యాచరణను ఇంకా ఖరారు చేసుకోలేదని ప్రకటించడం ద్వారా, సరికొత్త ప్రక్రియలో కాంగ్రెస్ ముందుకు వెళుతుందని సిబల్ చెప్పకనే చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here