అన్నాడీఎంకే ఉప ప్రధానకార్యదర్శి పదవినుంచి దినకరన్ ఔట్

0
21

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు ఉప ప్రధాన కార్యదర్శి అయిన దినకరన్‌ను పార్టీలోని అన్ని బాధ్యతలనుంచి తప్పిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల సమావేశం నిర్ణయించింది.ఆయన కుటుంబసభ్యులను కూడా పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెట్టాలని తీర్మానించింది. దీంతో శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి సాగనంపేందుకు అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఆమె వారసురాలిగా రాష్ర్టాన్ని, పార్టీని ఏకఛత్రాధిపత్యంతో ఏలాలనుకుని కలలుకన్న శశికళకు ఈ పరిణామం షాక్‌గా తాకనున్నది. తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ సినిమా ైక్లెమాక్స్‌ను మించిన ఉత్కంఠను రేపుతుండగా.. మంగళవారం మన్నార్ గుడి రాజకీయాలకు చెక్ పెడుతూ ఈ నిర్ణయం వెలువడింది. ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన మంత్రుల సమావేశంలో పార్టీ శ్రేణులు, ప్రజల ఆకాంక్షల మేరకు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ మీడియాకు వెల్లడించారు. పార్టీలోని అన్నిస్థాయుల్లోని శ్రేణులు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా కార్యదర్శులు, 123మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

పార్టీ రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు అతి త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ కమిటీయే అన్నాడీఎంకే విలీనంకు సంబంధించిన బాధ్యతలు నిర్వహంచనున్నట్టు సమాచారం. కాగా, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం డిమాండ్‌కు తలొగ్గే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి దినకరన్‌ను తప్పించారా..? అని మీడియా అడిగిన ప్రశ్న ను ఆయన తోసిపుచ్చారు. పన్నీర్‌సెల్వం డిమాండ్‌ను తాజా పరిణామానికి ముడిపెట్టవద్దని పేర్కొన్నారు. తమ మంత్రులు పన్నీర్‌సెల్వంతో చర్చలు జరుపడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలో సీనియర్ మంత్రులు దిండిగుల్ సీ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, ఆర్బీ ఉదయ్‌కుమార్, తంగమణి, సీ షణ్ముగం, రాజ్యసభ సభ్యుడు వీ వైథి లింగం పాల్గొన్నారు. కాగా, ఈ హఠాత్పరిణామానికి కారణం.. శశికళ, దినకరన్‌ను పార్టీనుంచి తప్పిస్తేనే విలీనంపై చర్చలకు సిద్ధమవుతామని పన్నీర్ వర్గం స్పష్టం చేయడమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY