అధికారులు, నాయకులందరి సమక్షంలో చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు

0
18

నేను, రామసుబ్బారెడ్డి గతంలో ప్రత్యర్థులం… ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటించాలని కార్యకర్తలకు చెప్పాను… ఇకపై అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమభాగం పంచుకోమని అధికారులు, నాయకులందరి సమక్షంలో సీఎం బహిరంగంగానే చెప్పారని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌ కావడంతో ‘సాక్షి’ప్రచురించిన కథనం నేపథ్యంలో ఆయన తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏ పనులు చేసినా చెరో సగం పంచుకోవాలని సీఎం చెప్పారని వెల్లడించారు. తాను, రామసుబ్బారెడ్డి ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా చేస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం తాను నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పానని వివరించారు. కోటి రూపాయల పనులు వస్తే రామసుబ్బారెడ్డి, తాను చెరోసగం తీసుకోవాలని, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పానని… దానికే లాభాలు, వాటాలు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఘోరమైన అభూతకల్పనలు సృష్టించారని ఆరోపించారు. సీఎం కార్యాలయ అధికారులు పరిపాలనలో భాగంగానే ముఖ్యమంత్రి చెప్పిన అనేక అంశాలను పర్యవేక్షిస్తారని, వారిని వివాదాల్లోకి లాగటమేమిటని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here