అద్భుతంగా గణతంత్ర దినోత్సవం

0
25

స్వదేశీ పరిజ్ఞానంతో రెక్కలు విప్పిన తేజస్ విమానాలు, అధునాతన భద్రతాయంత్రాంగానికి నిదర్శనంగా నిలిచిన ఎన్‌ఎస్‌జీ బ్లాక్‌క్యాట్ కమాండోలు, సైన్యం అమ్ములపొదిలో తాజాగా చేరిన ధనుష్ శతఘ్ని ఈసారి గణతంత్ర దినోత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుఖోయ్ విమానాల గగనతల విన్యాసాలు ఆహూతులను చకితులను చేశాయి. యూఏఈ నుంచి ప్రత్యేకంగా వచ్చిన త్రివిధ దళాల జవాన్ల బృందం ఈసారి కవాతులో పాల్గొనడం విశేషం. గురువారం ఢిల్లీలో నేత్రానందంగా జరిగిన 68వ గణతంత్ర దినోత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సర్వసైన్యాధ్యక్షుని హోదాలో రక్షణ దళాల వందనాన్ని స్వీకరించారు. భారత సైనికపాటవాన్ని, సంస్కృతీ వైభవాన్ని కండ్లకు కడుతూ రిపబ్లిక్ డే కవాతు సాగింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు ముఖ్యఅతిథిగా వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కవాతును తిలకించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

LEAVE A REPLY