అదో పనికిమాలిన ఉత్సవ్‌

0
15
విశాఖ ఉత్సవ్‌పై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోమారు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవ్‌పై తరచూ విమర్శలు చేస్తున్న మంత్రి.. నర్సీపట్నంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏకంగా ‘పనికిమాలిన ఉత్సవ్‌’ అంటూ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం సమీప పెద్దబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డులో శనివారం సాయంత్రం లేగ దూడల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ‘పాడి, మత్స్య పరిశ్రమల ద్వారానే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోంది. ఇటువంటి కార్యక్రమానికి ఆ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రూ.2 లక్షలు కూడా తీసుకురాలేకపోయారు.
విశాఖలో మాత్రం డ్యాన్సులాడే పనికి మాలిన విశాఖ ఉత్సవ్‌కు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ ఉత్సవ్‌ను రాష్ట్రస్థాయి పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇందుకోసం రూ.2.75 కోట్ల నిధులు విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల విశాఖకు పర్యాటకులు పెరుగుతారని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ముఖ్యమంత్రి అభిలాష. అయితే మంత్రి అయ్యన్న ఏ కారణం చేతనో ఆది నుంచి ఈ ఉత్సవ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
మూడు రోజుల కిందట అయ్యన్న విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించడం లేదని, అలా చేస్తే తాము ఎవరం అందులో పాల్గొనబోమని హెచ్చరిక చేశారు. కొందరు అధికారులు కావాలనే స్థానిక కళాకారులను పక్కన పెడుతున్నారని అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించి, స్థానికులకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ విశాఖ ఉత్సవ్‌ ప్రారంభ కార్యక్రమానికి అయ్యన్న గైర్హాజరయ్యారు. ఆయన వర్గంగా ముద్రపడిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతోపాటు ఇతర ఎమ్మెల్యేలు గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌ కూడా హాజరు కాలేదు.

LEAVE A REPLY