అగ్ని-5 క్షిప‌ణిని ప‌రీక్షించ‌డం ఇది నాలుగోసారి

0
39

భార‌త్ త‌యారుచేసిన ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5 చివ‌రి ప‌రీక్ష కూడా విజ‌య‌వంత‌మైంది. ఒడిశాలోని వీల‌ర్ ఐలాండ్ నుంచి దీనిని స‌క్సెస్‌ఫుల్‌గా పరీక్షించారు. అన్ని ప‌రీక్ష‌లు విజ‌య‌వంతం కావ‌డంతో ఈ ఖండాంత‌ర క్షిప‌ణిని స్ట్రేట‌జిక్ ఫోర్సెస్ క‌మాండ్‌(ఎస్ఎఫ్‌సీ)కు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైంది. అణ్వాయుధాల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌గ‌డంతోపాటు ఐదు వేల కిలోమీట‌ర్ల దూరంలోని లక్ష్యాల‌ను కూడా ఛేదించ‌గ‌లిగే అగ్ని-5 మిస్సైల్‌.. చైనాలోని ఈశాన్య ప్రాంతాలను కూడా తాక‌గ‌ల‌దు. అగ్ని-5 పూర్తి ప‌రిధిని సోమ‌వారం ప‌రీక్షించారు. ఇది పూర్తిగా విజ‌య‌వంత‌మైందా లేదా అన్న‌దానిని శాస్త్రవేత్త‌లు విశ్లేషించే ప‌నిలో ఉన్నారు. దీనికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఓ అధికారి వెల్ల‌డించారు.

అగ్ని-5 క్షిప‌ణిని ప‌రీక్షించ‌డం ఇది నాలుగోసారి. భార‌త్ అణ్వాయుధాల‌ను నిర్వ‌హించే ఎస్ఎఫ్‌సీ స‌రిపడా అగ్ని-5 మిస్సైల్స్‌ను ఆర్డ‌ర్ చేసే ముందు క‌నీసం రెండుసార్లు యూజ‌ర్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల్సి ఉంటుంది. అగ్ని-5 క్షిప‌ణిని తొలిసారి ఏప్రిల్ 2012, సెప్టెంబ‌ర్ 2013, జ‌న‌వ‌రి 2015ల‌లో ప‌రీక్షించారు. ఈ అగ్ని-5తో 5 వేల నుంచి 5500 కిలోమీట‌ర్ల ప‌రిధి మిస్సైల్స్ ఉన్న అమెరికా, ర‌ష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకేల స‌ర‌స‌న భార‌త్ నిల‌వ‌నుంది. ఎస్ఎఫ్‌సీలో ఇప్ప‌టికే త‌క్కువ ప‌రిధి గ‌ల పృథ్వి, ధ‌నుష్ మిస్సైల్స్‌తోపాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 మిస్సైల్స్ ఉన్నాయి. ఈ మిస్సైల్స్ అన్నీ పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకొని త‌యారు చేయ‌గా.. అగ్ని-4, అగ్ని-5 మాత్రం చైనా ల‌క్ష్యంగా త‌యారుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here