అక్కడ 500 ఏండ్లుగా నగదురహితమే!

0
25

నగదు రహిత లావాదేవీలు.. పెద్దనోట్ల రద్దు తర్వాత దాదాపు అందరికీ పరిచయమైన పదం ఇది. అయితే అసోం రాష్ట్రంలోని మారుమూల గిరిజన గ్రామంలో దాదాపు ఐదువందల ఏండ్లుగా నగదు రహిత లావాదేవీలే కొనసాగుతున్నాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. అసోం రాజధాని గౌహతీకి 32 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న టివా జాతి గిరిజనులు దాదాపు ఐదు శతాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సెంట్రల్ అసోంతోపాటు, పక్కనే ఉన్న మేఘాలయలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న టివా జాతి గిరిజనులు ఏటా జనవరి మూడో వారంలో అసోంలోని మరిగావ్ జిల్లాలో మూడు రోజుల పాటు పెద్దఎత్తున అంగడి నిర్వహిస్తారు. దీనిని జంబిల్ మేళా అని పిలుస్తారు. అక్కడ గిరిజనులు తమ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వారి వద్ద నుంచి తమకు కావాల్సిన వస్తువులు తీసుకుంటారు. ఇది పూర్వకాలంలో జరిగిన వస్తుమార్పిడి పద్దతి వంటిదన్నమాట. ఇటీవల జరిగిన మేళాకు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న నగదు రహిత లావాదేవీలను చూసి పట్టణ ప్రజలు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here